తౌహీద్ (ఏకదైవ విశ్వాస) విభాగము
జవాబు: నా ధర్మము ఇస్లాం. ఏకదైవారాధన ద్వారా అల్లాహ్ కు సమర్పించుకోవడం, వినయవిధేయతలతో, వినమ్రతతో ఆయనను ఆరాధించడం, షిర్క్ (బహుదైవారాధన) నుండి మరియు బహుదైవారాధకుల నుండి తనను తాను దూరంగా ఉంచడమే ఇస్లాం ధర్మము.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : నిశ్చయంగా, అల్లాహ్ కు సమ్మతమైన ధర్మం కేవలం అల్లాహ్ కు విధేయులవటం మాత్రమే (ఇస్లాం ధర్మం మాత్రమే). [సూరతు ఆలే ఇమ్రాన్ : 19వ ఆయతు]
జవాబు: తౌహీద్ పదాలు "లా ఇలాహ ఇల్లల్లాహ్" అంటే అల్లాహ్ తప్ప మరెవ్వడూ ఆరాధనలకు అర్హుడు కాదు. అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని సాక్ష్యమివ్వటం యొక్క అర్ధం: అల్లాహ్ తప్ప వేరే వాస్తవ ఆరాధ్యుడు లేడు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : కావున (ఓ ముహమ్మద్!) తెలుసుకో! నిశ్చయంగా, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. [సూరహ్ ముహమ్మద్ : 19వ ఆయతు]
అల్లాహ్ స్వర్గంలో, తన అర్ష్ పై (సింహాసనంపై) ఉన్నాడు. అది మొత్తం సృష్టి పైన ఉన్నది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : ఆ కరుణా ప్రధాత, అర్ష్ పై (సింహాసనంపై) అధీష్టించి ఉన్నాడు. [సూరతు తాహా : 5వ ఆయతు] ఇంకా ఇలా సెలవిచ్చాడు : మరియు ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు మరియు ఆయన మహా వివేచనాపరుడు, సర్వం తెలిసినవాడు. [సూరతుల్ అన్ఆమ్: 18వ ఆయతు]
జవాబు: దాని అర్థం - నిశ్చయంగా అల్లాహ్ ఆయనను సర్వలోకాలకు శుభవార్త తెలిపే వానిగా మరియు హెచ్చరించే వానిగా చేసి పంపినాడు.
అందువలన ఆయన గురించి ప్రతి ఒక్కరిపై క్రింది విషయాలు విధి గావించబడి ఉన్నాయి:
1. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞలను శిరసావహించుట.
2. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన దానిని విశ్వసించుట.
3. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు అవిధేయత చూపకుండా ఉండుట.
4. మహోన్నతుడైన అల్లాహ్ ను ఆయన షరీఅతు ప్రకారం మాత్రమే ఆరాధించుట అంటే సున్నతులను అనుసరించుట మరియు ఇస్లాం ధర్మంలో నూతన కల్పితాలను, ఆవిష్కరణలను బహిష్కరించుట అత్యవసరమైది.
ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : "ఎవడు ప్రవక్తకు విధేయత చూపుతాడో, వాస్తవంగా అతడు అల్లాహ్ కు విధేయత చూపినట్లే." [సూరతున్నిసా: 80వ ఆయతు]. ఇంకా మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {మరియు అతను తన మనోవాంఛలను అనుసరించి మాట్లాడడు(3). అది (అతను పలుకుతున్నది), అతనిపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం (వహీ) మాత్రమే(4).} [సూరతున్నజమ్ : 3 - 4] ఇంకా మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {వాస్తవానికి, అల్లాహ్ యొక్క సందేశహరునిలో మీ కొరకు ఒక ఉత్తమమైన ఆదర్శం ఉన్నది - ఎవరైతే అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసిస్తారో మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరిస్తారో వారి కొరకు!}[21] [సూరతుల్ అహ్'జాబ్ : 21వ ఆయతు]
జవాబు: ఆయనకు ఎవ్వరినీ, దేనినీ సాటి లేదా భాగస్వామ్యం కల్పించకుండా, కేవలం తనను మాత్రమే ఆరాధించేందుకు గానూ ఆయన మనల్ని సృష్టించినాడు.
ఆయన మనల్ని వినోదం కోసమో లేదా ఆటపాటల కోసమో సృష్టించలేదు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {మరియు నేను జిన్నాతులను మరియు మానవులను కేవలం నా ఆరాధన కొరకే సృష్టించాను.} [సూరతు అజ్జారియాత్ : 56వ ఆయతు]
ఆరాధన (ఇబాదత్) అనేది ఒక విస్తృతమైన పదము. ఇది అల్లాహ్ ఇష్టపడే మరియు సంతుష్టపడే అన్నిరకాల బహిర్గతమైన మరియు గోప్యమైన మొత్తం మాటలు మరియు ఆచరణలు కలిగి ఉన్నది.
తస్బీహ్ (అల్లాహ్ ను కీర్తించడం), తహ్మీద్ (అల్లాహ్ ను స్తుతించడం), మరియు తక్బీర్ (అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని ప్రకటించడం) మొదలైన పదాలతో అల్లాహ్ యొక్క జిక్ర్ ను (ధ్యానాన్ని) తమ నాలుకతో చేయుట, సలాహ్ (నమాజు) చేయుట మరియు హజ్ యాత్ర చేయుట వంటివి బహిర్గతమైన ఆరాధనకు ఉదాహరణ.
మరోవైపు, అల్లాహ్ పై ఆధారపడుట, ఆయనకు భయపడుట మరియు ఆయనపై ఆశలు పెట్టుకొనుట మొదలైనవి గోప్యమైన ఆరాధనకు ఉదాహరణలు.
జవాబు: తౌహీద్ మూడు భాగాలలో విభజింపబడినది. మొదటిది తౌహీద్ రుబూబియ్యహ్ (విశ్వాసంలో ఏకత్వం): కేవలం అల్లాహ్ మాత్రమే సమస్త సృష్టిరాశుల సృష్టికర్త, ప్రధాత, యజమాని మరియు వ్యవహారాలను నిర్వహించేవాడని నమ్ముట.
రెండవది తౌహీద్ ఉలూహియ్యహ్ (ఆరాధనలలో ఏకత్వం): సకల ఆరాధనలు కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించుట అంటే, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ ఆరాధించకుండా ఉండుట.
ఇక మూడవది తౌహీద్ అస్మా వ సిఫ్ఫాత్ (దివ్యనామాలు మరియు దివ్యగుణాలలో ఏకత్వం): ఖుర్ఆన్ మరియు సున్నతులలో తమ్'సీల్ (అల్లాహ్ మరియు ఆయన సృష్టి మధ్య సారూప్యతను కల్పించుట), తష్'బీహ్ (అల్లాహ్ ను ఆయన సృష్టితో పోల్చుట), లేదా త’అతీల్ (నిరాకరించుట, తిరస్కరించుట) మొదలైన వాటికి తావు లేకుండా అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యగుణాలను విశ్వసించడం అని దీని అర్థం.
మూడు రకాల తౌహీదులకు సంబంధించిన ప్రామాణిక ఆధారం: మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: "ఆకాశాలకూ, భూమికీ మరియు వాటి మధ్యనున్న సమస్తానికీ ఆయనే ప్రభువు. కావున మీరు ఆయననే ఆరాధించండి మరియు ఆయన ఆరాధన పైనే స్థిరంగా ఉండండి. నీకు తెలిసినంత వరకు ఆయనకు సాటి గలవాడు ఎవడైన ఉన్నాడా?" [సూరతు మర్యమ్ : 65వ ఆయతు]
జవాబు: షిర్క్ (మహోన్నతుడైన అల్లాహ్ కు సాటి కల్పించుట, ఆయన ఏక దైవత్వంలో భాగస్వాములను చేర్చుట)
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : నిశ్చయంగా, అల్లాహ్ తనకు భాగస్వామిని (సాటిని) కల్పించటాన్ని ఏ మాత్రమూ క్షమించడు. మరియు అది తప్ప దేనినైనా (ఏ పాపాన్ని అయినా), ఆయన తాను కోరిన వారి విషయంలో క్షమిస్తాడు. మరియు అల్లాహ్ కు భాగస్వాములను కల్పించినవాడే, వాస్తవానికి మహాపాపం చేసిన వాడు! [సూరతున్నిసా : 48వ ఆయతు]
జవాబు: షిర్క్ అంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు కాకుండా ఇతరులకు ఎలాంటి ఆరాధనలనైనా అంకితం చేయడం.
షిర్క్ లోని రకాలు:
షిర్కే అక్బర్: ఉదాహరణ: మహోన్నతుడైన అల్లాహ్ ను కాకుండా ఇతరులను వేడుకొనుట, ఇతరులకు సజ్దా చేయుట (సాష్టాంగ పడుట), ఇతరుల పేరు మీద జిబహ్ చేయుట (బలిపశువు వధించుట, ఖుర్బానీ చేయుట) మొదలైనవి.
షిర్కే అస్గర్: ఉదాహరణ: మహోన్నతుడైన అల్లాహ్ పై కాకుండా ఇతరులపై ప్రమాణం చేయుట; తమకు ప్రయోజనం కలిగిస్తాయనే లేదా హాని నుండి రక్షిస్తాయనే నమ్మకంతో తాయెత్తులు కట్టుకొనుట లేదా వ్రేలాడ దీయుట; ఇతరుల మెప్పు కోసం తన ఆరాధనలను మరింతగా పొడిగించుట (ప్రదర్శనాబుద్ధి).
జవాబు: ఈమాన్ యొక్క మూలనియమాలు ఆరు. అవి: 1) మహోన్నతుడైన అల్లాహ్ పై విశ్వాసం.
2) ఆయన దూతలపై విశ్వాసం.
3) ఆయన గ్రంధాలపై విశ్వాసం.
4) ఆయన సందేశహరులపై విశ్వాసం.
5) అంతిమదినంపై విశ్వాసం.
6) ఖదర్ (విధివ్రాత)పై విశ్వాసం.
దీనికి సాక్ష్యాధారం: ముస్లిం హదీసు గ్రంధంలో నమోదు చేయబడిన సుప్రసిద్ధ హదీసు జిబ్రయీల్ అలైహిస్సలాం లో దీని సాక్ష్యాధారం ఉన్నది: ఇక ఈమాన్ (విశ్వాసం) గురించి నాకు తెలుపండి. దానికి ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా పలికారు: "అల్లాహ్ ను, ఆయన దైవదూతలను, ఆయన గ్రంధాలను, ఆయన ప్రవక్తలను, అంతిమదినాన్ని మరియు విధివ్రాతను విశ్వసించుట".
జవాబు: మహోన్నతుడైన అల్లాహ్ పై విశ్వాసం:
మిమ్మల్ని సృష్టించిన, మిమ్మల్ని పోషిస్తున్న, ఇంకా సకల సృష్టిరాశుల యజమాని మరియు నిర్వాహకుడు అయిన అల్లాహ్ ను మాత్రమే విశ్వసించుట.
మరియు ఆయనే ఆరాధ్యుడు. నిజానికి, ఆయన తప్ప మరెవ్వరూ ఆరాధ్యులు లేరు.
మరియు ఆయన సర్వశక్తిమంతుడు, గొప్పవాడు, సంపూర్ణుడు, సకల ప్రశంసలు ఆయనకే శోభిస్తాయి, అత్యంత సుందరమైన దివ్యనామాలు మరియు దివ్యమైన సుగుణాలు ఆయనకే చెందుతాయి. ఆయనకు సాటి ఎవ్వరూ లేరు. ఆయనను పోలిన వారెవ్వరూ లేరు. ఆయనలో ఎలాంటి లోపాలూ, కొరతలూ లేవు.
దైవదూతల పై విశ్వాసం:
కేవలం తనను మాత్రమే ఆరాధించడానికి మరియు తన ఆజ్ఞలను మాత్రమే పూర్తిగా అనుసరించేందుకు, అల్లాహ్ కాంతి నుండి సృష్టించిన గొప్ప సృష్టిరాశులే దైవదూతలు.
వారిలో జిబ్రయీల్ అలైహిస్సలామ్ ఒకరు. ఆయన ప్రవక్తలకు, సందేశహరులకు ప్రత్యక్షంగా దైవసందేశాన్ని అందిస్తారు.
దైవగ్రంధాల పై విశ్వాసం:
ఉదాహరణకు అల్లాహ్ తన సందేశహరులపై అవతరింప జేసిన గ్రంధాలు.
ఖుర్ఆన్ గ్రంధం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింప జేయబడింది.
ఇంజీలు గ్రంధం ప్రవక్త ఈసా అలైహిస్సలాం పై అవతరింప జేయబడింది.
తౌరాతు గ్రంధం ప్రవక్త మూసా అలైహిస్సలాం పై అవతరింప జేయబడింది.
జబూర్ గ్రంధం ప్రవక్త దూవూద్ అలైహిస్సలాం పై అవతరింప జేయబడింది.
సహీఫ ఇబ్రాహీమ్ మరియు మూసా (అలైహిమ స్సలాం): ప్రవక్త ఇబ్రాహీమ్ మరియు మూసా అలైహిమస్సలాంల పై అవతరింప జేయబడినాయి.
దైవసందేశహరుల పై విశ్వాసం:
మరియు తన దాసులకు (ధర్మం) బోధించడానికి, మంచితనం మరియు స్వర్గానికి సంబంధించిన శుభవార్తలను అందించడానికి, ఇంకా చెడు మరియు నరకం నుండి వారిని హెచ్చరించడానికి అల్లాహ్ తన సందేశహరులను ఉద్భవింపజేసాడు.
మరియు వారిలో ఉత్తములు మరియు దృఢసంకల్పం గల కొందరు సందేశహరులు:
నూహ్ అలైహిస్సలాం.
ఇబ్రాహీమ్ అలైహిస్సలాం.
మూసా అలైహిస్సలాం.
ఈసా అలైహిస్సలాం.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
ప్రళయదినం పై విశ్వాసం:
ప్రళయదినంపై విశ్వాసం అంటే సమాధిలోని మరణానంతరం జీవితంపై విశ్వాసం ఉదాహరణకు ప్రళయదినం, పునరుత్థాన దినం, అంతిమ తీర్పుదినం, చివరికి శాశ్వతంగా స్వర్గవాసులు స్వర్గంలోని తమ స్థానాల్లో మరియ నరకవాసులు నరకంలోని తమ స్థానాల్లో చేరటంపై విశ్వాసం.
6) అల్ ఖదర్ (విధివ్రాత)పై విశ్వాసం:
అల్ ఖదర్: విశ్వంలో జరిగే ప్రతిదీ అల్లాహ్ కు తెలుసు అనీ, ఆయన ఆ జ్ఞానాన్ని దానిని అత్యంత సురక్షితంగా భద్రపరచబడిన ‘అల్ కితాబ్’ అనే దివ్యగ్రంధంలో లిఖించి ఉంచాడని, దాని ఉనికి ఆయన ఇష్టానుసారమే ఉందని మరియు దానిని ఆయనే సృష్టించాడని విశ్వసించుట.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : "నిశ్చయంగా మేము ప్రతి దానినీ నిర్ణీత పరిమాణములో సృష్టించాము." [సూరతుల్ ఖమర్ 49]
అది నాలుగు స్థాయిలలో జరిగింది:
మొదటిది: మహోన్నతుడైన అల్లాహ్ యొక్క మహాద్భుత జ్ఞానము. ప్రతిదీ సంభవించక ముందు మరియు సంభవించిన తర్వాత విషయాల గురించి తన అపూర్వ జ్ఞానం వలన ఆయన ముందే ఎరుగును.
దీనికి సాక్ష్యం: మహోన్నతుడైన అల్లాహ్ యొక్క వాక్కు: నిశ్చయంగా, ఆ (అంతిమ) ఘడియ యొక్క జ్ఞానము కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది. మరియు ఆయనే వర్షాన్ని కురిపించేవాడు మరియు గర్భాలలో ఉన్నదాని విషయం తెలిసినవాడు. మరియు తాను రేపు ఏమి సంపాదిస్తాడో, ఏ మానవుడు కూడా ఎరుగడు. మరియు ఏ మానవుడు కూడా తాను ఏ భూభాగంలో మరణిస్తాడో కూడా ఎరుగడు. నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే సర్వజ్ఞుడు, సమస్తమూ తెలిసినవాడు (ఎరిగినవాడు). [సూరతు లుఖ్మాన్: 34వ ఆయతు]
రెండవది: దీనిని అల్లాహ్ సురక్షితంగా భద్రపరచబడిన ‘అల్ కితాబ్’ అనే మహాద్భుత గ్రంధంలో లిఖించాడు. కాబట్టి జరిగినదీ మరియు జరగబోయేదీ ప్రతిదీ ఆయన అందులో నమోదు చేసి ఉంచాడు.
దీనికి సాక్ష్యం: మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు: {మరియు అగోచర విషయాల తాళపు చెవులు ఆయన (అల్లాహ్) వద్దనే ఉన్నాయి. వాటిని, ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు భూమిలోనూ, సముద్రంలోనూ ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు ఆయనకు తెలియకుండా ఏ చెట్టు ఆకు కూడా రాలదు మరియు భూమిలోని చీకటి పొరలలో ఉన్న ప్రతి గింజా, అది పచ్చిది కానీ ఎండినది కానీ, అంతా స్పష్టంగా ఒక గ్రంధంలో (వ్రాయబడి) ఉంది.}[59] [సూరతుల్ అన్ఆమ్: 59వ ఆయతు]
మూడవది: ప్రతిదీ అల్లాహ్ యొక్క చిత్తం ద్వారా మాత్రమే జరుగుతుంది మరియు ఆయన సృష్టిలోనిదేదీ ఆయన ఇష్టానుసారంగా కాకుండా జరగదు.
దీనికి సాక్ష్యం: మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు: మీలో, ఋజుమార్గంలో నడవదలచుకున్న ప్రతివాని కొరకు. మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు. [సూరతు అత్తక్వీర్: 28-29వ ఆయతులు]
నాల్గవది: మొత్తం సృష్టిలోని జీవరాశులన్నీ అల్లాహ్ చే సృష్టించబడిన జీవరాశులు అని విశ్వసించుట. ఆయనే వాటి ఆత్మలనూ, గుణగణాలనూ, కదలికలనూ మరియు వాటిలో ఉన్న ప్రతిదాన్నీ సృష్టించాడు.
దీనికి సాక్ష్యం: మహోన్నతుడైన అల్లాహ్ యొక్క వాక్కు: "వాస్తవానికి, మిమ్మల్నీ మరియు మీరు చేసిన (చెక్కిన) వాటినీ సృష్టించింది అల్లాహ్ యే కదా!" [సూరతు అస్సాఫ్ఫాత్: 96]
జవాబు: ప్రజలు ధర్మంలో ఆవిష్కరించిన ప్రతి నూతన కల్పితమూ బిద్అత్ గానే పరిగణించబడుతుంది. మరియు దాని ఉనికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరుల కాలంలో కనబడదు.
దానిని మనం అంగీకరించకూడదు, వాస్తవానికి దానిని సూటీగా తిరస్కరించ వలెను.
నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ప్రతి నూతన ధార్మిక కల్పితం, ఆవిష్కరణ మార్గభ్రష్టత్వమే. అబూ దావుద్ హదీసు గ్రంధము.
ఉదాహరణకు: వుజులో (మూడు సార్లు కడగటంతో ఆగకుండా) నాల్గవ సారి కడగటం, ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పుట్టినరోజు జరుపుకోవడం వంటి ఆరాధనలో నిర్దేశించబడిన వాటిలో హద్దులు మీరటం. ఇలాంటివి ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నుండి గానీ, ఆయన సహాబాల రజియల్లాహు అన్హుమ్ నుండి గానీ నమోదు చేయబడలేదు.
జవాబు: అల్ వలాఅ అంటే దైవవిశ్వాసులతో ప్రేమగా మెలుగుతూ, వినమ్రతతో వారికి సహాయ సహకారాలు అందించుట.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : మరియు విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు ఒకరి కొకరు స్నేహితులు. [సూరతు అత్తౌబా: 71వ ఆయతు]
అల్ బరాఅ: అంటే సత్యతిరస్కారులను మరియు ఇస్లాంకు విరుద్ధంగా వారు చూపే శత్రుత్వాన్ని ద్వేషించుట.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : "వాస్తవానికి ఇబ్రాహీమ్ మరియు అతనితో ఉన్న వారిలో మీ కొరకు ఒక మంచి ఆదర్శం ఉంది. వారు తమ జాతి వారితో ఇలా అన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకో: "నిశ్చయంగా, అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించే వాటితో మరియు మీతో, మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము మిమ్మల్ని త్యజించాము మరియు మీరు అద్వితీయుడైన అల్లాహ్ ను విశ్వసించనంత వరకు, మాకూ మీకూ మధ్య విరోధం మరియు ద్వేషం ఉంటుంది". [సూరతుల్ ముమ్తహినహ్: 4వ ఆయతు]
జవాబు: ఇస్లాం ధర్మాన్ని కాకుండా వేరే ధర్మాన్ని అల్లాహ్ అస్సలు అంగీకరించడు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత చూపడాన్ని (ఇస్లాం ను) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడే వారిలో చేరుతాడు. [సూరతు ఆలే ఇమ్రాన్ : 85వ ఆయతు]
జవాబు: మాటల్లో సత్యతిరస్కారానికి, అవిశ్వాసానికి ఒక ఉదాహరణ: అల్లాహ్ ను లేదా ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను దూషించడం.
చేతల్లో సత్యతిరస్కారానికి, అవిశ్వాసానికి ఒక ఉదాహరణ: ఖుర్ఆన్ ను అవమానించడం లేదా మహోన్నతుడైన అల్లాహ్ కు కాకుండా మరొకరికి సజ్దా (సాష్టాంగం) చేయడం.
మనస్సులోపల సత్యతిరస్కారానికి, అవిశ్వాసానికి ఒక ఉదాహరణ: మహోన్నతుడైన అల్లాహ్ కాకుండా ఆరాధనలకు అర్హుడు మరొకడు ఉన్నాడని లేదా మహోన్నతుడైన అల్లాహ్ తో పాటు మరో సృష్టికర్త ఉన్నాడని నమ్మడం.
జవాబు:
1) ఘోరమైన కపటత్వము (అన్నిఫాఖు అల్ అక్బరు): మనసు లోపల అవిశ్వాసాన్ని దాచి పెట్టి, బయటికి విశ్వాసిగా నటించడం.
ఇది ఇస్లాం నుండి బహిష్కరింప జేస్తుంది మరియు ఇది ఘోరమైన అవిశ్వాసంగా పరిగణించబడుతుంది.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : నిశ్చయంగా కపట విశ్వాసులు నరకంలోని అట్టడుగు అంతస్తులో పడి ఉంటారు. మరియు వారికి సహాయం చేయగల వాడిని ఎవ్వడినీ నీవు చూడవు. [సూరతున్నిసా : 48వ ఆయతు]
2) అల్పమైన కపటత్వము:
ఉదాహరణ: అబద్ధం పలకడం, వాగ్దాన భంగము, నమ్మకద్రోహము మొదలైనవి.
ఇది ఇస్లాం నుండి బహిష్కరింప జేయదు. గానీ, పాపకార్యంగా పరిగణించ బడుతుంది, అలాంటి వ్యక్తికి కఠినశిక్షలు విధించబడతాయి.
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: {కపటవిశ్వాసిలో మూడు చిహ్నాలు ఉంటాయి: అతడు మాట్లాడినప్పుడు అసత్యమాడుతాడు, ప్రమాణం చేసి తప్పుతాడు, అమానతుగా ఉంచమని అప్పగిస్తే, నమ్మకద్రోహం చేస్తాడు.} బుఖారీ మరియు ముస్లిం హదీసు గ్రంధాలు.
జవాబు: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {(ఓ మానవులారా!) ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు. కాని ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చిట్టచివరివాడు. [సూరతుల్ అహ్ జాబ్ : 21వ ఆయతు] రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: నేను ప్రవక్తల పరంపరను ముగించే సీలుముద్రను. నా తరువాత ఏ ప్రవక్తా పంపబడడు. అబూ దావూద్, తిర్మిజీ, నసాయి హదీసు గ్రంధాలు
ప్రతి అసాధారణమైన, అస్వభావికమైన, మానవాతీతమైన, ప్రకృతికి అతీతమైన అతీంద్రియ చర్య లేదా సంఘటనను మోజిజా అంటే మహిమ లేదా అద్భుతం అంటారు. మహోన్నతుడైన అల్లాహ్ తన ప్రవక్తలకు తమ నిజాయితీని నిరూపించుకోవడానికి మద్దతుగా వారికి కొన్ని మహిమలు, అద్భుతాలు ప్రసాదించాడు. ఉదాహరణకు:
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం (అల్లాహ్ ఆజ్ఞతో) చంద్రుడిని రెండుగా చీల్చడం.
మూసా అలైహిస్సలాం (అల్లాహ్ ఆజ్ఞతో) సముద్రాన్ని రెండుగా చీల్చడం, ఫిరౌనును మరియు అతడి సైన్యాన్ని అందులో ముంచి వేయడం.
జవాబు: ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రత్యక్ష్యంగా కలిసారో, విశ్వసించారో మరియు విశ్వాసిగానే చనిపోయారో, అతనిని సహాబా అంటారు.
మనం వారిని ప్రేమించ వలెను మరియు వారిని అనుసరించ వలెను. ప్రవక్తల తరువాత మానవజాతిలో వారు ఉత్తములు మరియు శుభమైన వారు.
వారిలో అత్యుత్తములు: నలుగురు ఖలీఫాలు.
అబూబక్ర్ రజియల్లాహు అన్హు
ఉమర్ రజియల్లాహు అన్హు
ఉస్మాన్ రజియల్లాహు అన్హు
అలీ రజియల్లాహు అన్హు
జవాబు: భయపడటం అంటే అది అల్లాహ్ నుండి మరియు ఆయన కఠినశిక్షల నుండి భయపడటం
ఆశ పడటం అంటే అల్లాహ్ నుండి అనుగ్రహాలు లభిస్తాయని ఆశించడం, అల్లాహ్ మనల్ని మన్నిస్తాడని మరియు మనపై కారుణ్యం చూపుతాడని ఆశించడం.
దీనికి ఆధారం : మహోన్నతుడై అల్లాహ్ వాక్కు : {వారే అంటే ఎవరినైతే వీరు ప్రార్థిస్తూ ఉన్నారో, వారే తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు. మరియు వారిలో ఆయనకు ఎవరు ఎక్కువ సాన్నిధ్యం పొందుతారో అని ప్రయత్నిస్తున్నారు. మరియు ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు మరియు ఆయన శిక్షకు భయపడుతున్నారు. నిశ్చయంగా నీ ప్రభువు శిక్ష, దానికి భయపడ వలసిందే!} [సూరతుల్ ఇస్రా: 57వ ఆయతు] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : నా దాసులకు ఇలా తెలియజెయ్యి: నిశ్చయంగా నేను, కేవలం నేనే! క్షమించేవాడను, కరుణించేవాడను. మరియు నిశ్చయంగా, నా శిక్షయే అతి బాధాకరమైన శిక్ష! [సూరతుల్ హిజ్ర్: 49-50వ ఆయతులు)
జవాబు: అల్లాహ్ - అర్ధము అల్ ఇలాహ్, నిజమైన ఆరాధ్యుడు, ఏకైకుడు, అద్వితీయుడు, ఆయనకు సాటి గానీ, భాగస్వాములు గానీ ముమ్మాటికీ ఎవ్వరూ లేరు, ఏదీ లేదు.
అర్రబ్: సృష్టికర్త, యజమాని, పోషకుడు, వ్యవహారాలను చక్కబెట్టేవాడు, ఏకైకుడు, ఏ లోపమూ మరియు ఏ కొరతా లేని వాడు.
అస్సమీఉ: సృష్టిలోని ప్రతిదీ వినగలిగేటంతటి గొప్ప శ్రవణశక్తి గలవాడు. వాటి మధ్య తేడాలు మరియు వైరుధ్యాలు ఉన్నప్పటికీ సృష్టిలోని శబ్దాలన్నింటినీ వినగలవాడు,
అల్ బసీరు: సృష్టిలోని ప్రతిదీ చూడగలిగేవాడు. సూక్ష్మమైనదైనా, అతి పెద్దది అయినా ప్రతిదీ చూడగలిగేవాడు.
అల్ అ'లీము: భూత, వర్తమాన, భవిష్య కాలములలో సృష్టిలోని ప్రతిదానిని తన అపూర్వ జ్ఞానంతో ఆవరించి ఉన్నవాడు.
అర్రహ్మాన్: సకల సృష్టిరాశులను ఆవరించగలిగేంత కరుణ కలిగినవాడు. ప్రతి దాసుడూ, ప్రతి సృష్టిరాశీ ఆయన కారుణ్యం వలననే జీవిస్తున్నాయి.
అర్రజ్'జాఖ్: మొత్తం మానవజాతినీ, జిన్నాతులనూ మరియు సృష్టిరాశులన్నింటినీ పోషించగలిగే శక్తి గలవాడు.
అల్ హయ్యి: నిత్యుడు, మరణం లేనివాడు. మొత్తం సృష్టి నాశనమై పోయినా మిగిలి ఉండే వాడు.
అల్ అజీమ్: తన దివ్యనామాలు, గుణగుణాలు మరియు దివ్య కార్యాలలో పరిపూర్ణతలన్నీ మరియు మహిమలన్నీ కలిగి ఉన్నవాడు.
జవాబు: ముస్లిం పండితుల పట్ల మన కర్తవ్యం ఏమిటంటే వారిని ప్రేమించడం మరియు షరీఅతు సంబంధిత సమస్యలు మరియు అపూర్వమైన సంఘటనల పరిష్కారం కొరకు వారిని సంప్రదించడం. మనం పండితులను సగౌరవంగా సంభోదించాలి మరియు ప్రస్తావించాలి. ఎవరైతే వారితో ప్రతికూలంగా, అవమానకరంగా ప్రవర్తిస్తారో, వారు సన్మార్గంపై లేనట్లే.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {మరియు మీలో విశ్వసించిన వారికి మరియు జ్ఞానం ప్రసాదించ- బడిన వారికి అల్లాహ్ ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు.11} [సూరతుల్ ముజాదిలహ్:11]
జవాబు: మహోన్నతుడైన అల్లాహ్ కు విధేయత చూపుతున్నప్పుడు ఈమాను పెరుగుతుంది మరియు అవిధేయత చూపుతూ, పాపాలు చేస్తున్నప్పుడు ఈమాన్ తరుగుతుంది.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : నిశ్చయంగా, విశ్వాసులైన వారి హృదయాలు అల్లాహ్ ప్రస్తావన వచ్చినపుడు భయంతో వణుకుతాయి. మరియు వారి ముందు ఆయన సూచనలు (ఖుర్ఆన్) పఠింపబడినప్పుడు వారి విశ్వాసం మరింత అధికమే అవుతుంది. మరియు వారు తమ ప్రభువు మీదే దృఢనమ్మకం కలిగి ఉంటారు. (సూరతుల్ అన్'ఫాల్: 2వ ఆయతు)
జవాబు: అందుబాటులో ఉన్న మార్గాలన్నింటినీ ఉపయోగించుకుంటూ, ప్రయోజనం పొందడంలో మరియు హానిని నివారించడంలో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పై మాత్రమే ఆధారపడటం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {ఎవరైతే అల్లాహ్ పై నమ్మకము ఉంచుతారో, అలాంటి వానికి ఆయనే చాలు...3} [సూరతు అత్తలాఖ్: 3]
హస్బుహు: అంటే ఆయన అతనికి సరిపోయేటంత అధికంగా ప్రసాదిస్తాడు అని అర్థము.
జవాబు: అల్ మఆరూఫ్ అంటే మహోన్నతుడైన అల్లాహ్ కు అన్ని విధాలా విధేయత చూపడం మరియు అల్ ముంకర్ అంటే మహోన్నతుడైన అల్లాహ్ అవిధేయత చూపుతూ పాపకార్యాలకు పాల్పడటం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {మీరు ధర్మాన్ని ఆదేశించే (బోధించే) వారు మరియు అధర్మాన్ని నిషేధించే (నిరోధించే) వారు మరియు మీరు అల్లాహ్ యందు విశ్వాసం కలిగి ఉన్నవారు.} [సూరతు ఆలే ఇమ్రాన్: 110వ ఆయతు]
జవాబు: తమ విశ్వాసంలోనూ, మాటలలోనూ మరియు చేతలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను, ఆయన సహాబాలను మాత్రమే తు.చ. తప్పకుండా అనుసరించేవారు.
మరియు వారికి అహ్లుల్ సున్నహ్ అనే పేరు పెట్టారు: ఎందుకంటే వారు కేవలం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతులను మాత్రమే అనుసరించినందుకు మరియు ధర్మంలో నూతన కల్పితాలను త్యజించినందుకు గానూ.
మరియు జమాఅతు: ఎందుకంటే వారు సామూహికంగా సత్యంపై జమ అయ్యారు మరియు తమలో తాము భేదభావాలతో విడిపోలేదు.